Keesara | కీసర, ఏప్రిల్ 8; కీసరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద నిర్మిస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. దమ్మాయిగూడ మున్సిపల్ నిధులతో డ్రైనేజీ పనులు చేపడుతూనే ఆ మురికి నీటిని దవాఖాన ముందుభాగంలోని చెరువులోకి వదిలేందుకు పైప్లైన్లు వేయడంపై పక్కనే ఉన్న కాలనీవాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ చెరువును ఆనుకొని ప్రభుత్వ మండల పరిషత్ కార్యాలయం, స్నేహా కాలనీలు ఉన్నాయి. బండపై ఉన్న ఆ చెరువులోకి ఆసుపత్రి నుంచి వచ్చే వ్యర్థపు నీటితో తీవ్ర దుర్గంధం రావడంతో దోమలు, ఈగలు పెరిగిపోయి కాలనీవాసులకు రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆ కాలనీవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువును ఆనుకొని మరో రెండు చెరువులు కూడా ఉన్నాయని, ఈ మురికినీటిని చెరువులోకి పంపిస్తే చెరువులు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు.
ప్రభుత్వ దవాఖాన ఆవరణలోనే పెద్ద ఎత్తున్న సెప్టిక్ ట్యాంక్ నిర్మించి ఆ మురికినీటిని వాటిలో వదిలేయాలని స్నేహాకాలనీవాసులు దవాఖాన ముందు మంగళవారం అందోళనకు దిగారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల భవిష్యత్‌లో పెద్ద ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని, ఆ ముప్పు రాకముందే ఆప్రమత్తంగా ఉండాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మురికినీటిని చెరువులోకి కలుపకుండా చేయాలని కోరుతున్నారు.