జవహర్నగర్, మే 22: మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు, జంగ్ పత్రిక సంపాదకుడు నవీన్, మరో 25మంది మవోయిస్టులను ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో దారుణంగా చంపడం దుర్మార్గమని, ఇవీ ముమ్మాటికి రాజకీయ హత్యలేనని ఇఫ్టు జాతీయ కన్వీనర్ షేక్ షావలి స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో మవోయిస్టులను హత్యలు చేయడం దారుణమని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నంబాల కేశవరావు మృతిపై దేశ ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ మావోయిస్టులపై సాధించిన అతిపెద్ద విజయంగా కీర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఫహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు, మధ్య భారతదేశంలో గత 16నెలలుగా వందలాది ఆదివాసులకు పొట్టన పెట్టుకున్న వారికి పెద్ద తేడా ఏముందో చెప్పాలని ప్రశ్నించారు. ఆదివాసీల హక్కుల రక్షణ కోసం పోరాడుతున్న మవోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని పలుమార్లు ప్రకటించినప్పటికి, ఆపరేషన్ కగార్ పేరుతో హత్యకాండకు మొగ్గుచూపడాన్ని దేశంలో మేధావులు, కవులు, రాజకీయ పార్టీలు వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. అడవిలోని జీవరాశులను, పర్యావరణాన్ని దెబ్బతీసే కుట్రపూరితమైన చర్యలను సంఘటితంగా ప్రతి పౌరుడు ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు.