Govt land road | దుండిగల్, జూలై 17: ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి ఫోన్ వచ్చిందనే నెపంతో అధికారులు ప్రభుత్వ భూముల్లోంచి రోడ్డు నిర్మిస్తూ ప్రైవేటు వెంచర్లకు కొమ్ముకాస్తారా…? అంటూ పలువురు నేతలు గురువారం దుండిగల్ మున్సిపల్ కమిషనర్, గండి మైసమ్మ -దుండిగల్ మండల తహసీల్దార్లను ప్రశ్నించారు.
గండి మైసమ్మ దుండిగల్ మండలం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, బౌరంపేటలోని సిల్వర్ వోక్స్ పాఠశాల నుంచి వ్యవసాయ భూముల మీదుగా గతంలో బండ్లబాటగా ఉన్న దారిని ఆగమేఘాల మీద అధికారులు 40 ఫీట్ల రోడ్డుగా విస్తరించడం పట్ల గత వారం రోజులుగా విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ నాయకులు ఏంబరి ఆంజనేయులు తదితర నేతలు గురువారం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, గండి మైసమ్మ దుండిగల్ తాసిల్దార్ మతిన్ను కలిసి ఈ విషయంపై స్పష్టతనివ్వాలని కోరారు.
స్థానిక అధికారుల మద్దతు లేకుండానే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయా..? అంటూ ప్రశ్నించారు. కొందరు వ్యక్తులు తాము సీఎంకు దగ్గర మనుషులం అంటూ… మమ్మల్ని ఎవరేమీ చేయలేరంటూ వ్యాఖ్యానిస్తుండగా, అధికారులు సైతం సీఎంఓ నుంచి తమకు ఒత్తిడి ఉందని పేర్కొనడం ఎంతవరకు సమంజసంమన్నారు. సీఎమ్ఓ పేరు చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లోంచి రోడ్డు నిర్మిస్తారా..? సీఎంఓ పేరు చెప్పి సుమారు రూ. 100 కోట్ల విలువచేసే 5 ఎకరాల ప్రభుత్వ భూమి, సర్వేనెంబర్ 166, 166/1, 166/3 లో ఎటువంటి అనుమతులు లేకుండా రోడ్డు విస్తరణ పనులు ఏ విధంగా చేపడుతారని ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైన చాలాచోట్ల రోడ్డు నిర్మించాలని అడుగుతున్నా స్పందించని అధికారులు, ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా రోడ్డు వేస్తారో తెలపాలని కోరారు.
ప్రైవేటు వెంచర్లైన రుద్ర, జేఎన్ఎస్ నిర్మాణ సంస్థలు బౌన్సర్లను పెట్టుకొని రోడ్డు నిర్మిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారన్నారు. అధికారులు తక్షణమే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను నిలుపుదల చేయడమే కాకుండా ప్రైవేట్ వెంచర్ల నిర్వాహకులు రుద్ర, జేఎన్ఎస్ నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రైవేట్ వెంచర్లకు సహకరిస్తున్న దుండిగల్ మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లపై శాఖా పరమైన చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు.
రోడ్డు నిర్మాణానికి, మునిసిపాలిటీకి సంబంధం లేదు : మున్సిపల్ కమిషనర్.
కాగా బౌరంపేటలోని 166 ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న 40 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు తమకు ఎలాంటి సంబంధం లేదని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. సిల్వర్ వర్క్స్ పాఠశాల నుంచి లోపలికి వెళ్లే రోడ్డు మాస్టర్ ప్లాన్ లో ఉందని, అందులో భాగంగా రైతులకు తాము నోటీసులు అందజేసిన మాట వాస్తవమే అన్నారు. కానీ రైతులు తామంతట తామే ముందుకు వచ్చి రోడ్డు నిర్మించుకుంటున్నారని తెలిపారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు నిర్మాణం జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.