ఎల్లంపేట: మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్‌లో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు (School Bus) అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. మురికి కాల్వలో చక్రాలు ఇరుక్కుపోవడంతో ఆగిపోయింది. లేనట్లయితే ముందున్న ఓ గదిని ఢీకొట్టేంది. శనివారం ఉదయం మేడ్చల్ పట్టణంలోని చాణక్య విజన్ స్కూల్‌కు చెందిన బస్సు లింగాపూర్ నుంచి విద్యార్థులను తీసుకొని పాఠాశాలకు వెళ్తున్నది. ఈ క్రమంలో అదుపుతప్పిన బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. పక్కనే ఉన్న మురికి కాలువలో బస్సు టైర్లు ఇరుక్కుపోవడంతో కుడి వైపు ఒరిగిపోయింది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో బస్సులో 12 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.
బురదలో టైర్లు దిగబడటంతో అక్కడే ఉన్న ఓ గదికి సమీపానికి వెళ్లి ఆగిపోయింది. ఘోర ప్రమాదం తప్పిపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, పాఠశాల ప్రిన్సిపల్ ఘటన స్థలానికి చేరుకొని, విద్యార్థులను చికిత్స నిమిత్తం మేడ్చల్ దవాఖానకు తరలించారు. జేసీబీ సాయంతో పక్కకు ఒరిగిపోయిన బస్సును బయటకు తీశారు. డ్రైవర్ అజాగ్రత్తగా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, బస్సు ఫిట్నెస్ సరిగా లేకపోవడం కూడా ఇందుకు కారణం అని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు వాహనాల భద్రతను పట్టించుకోవడం లేని కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.