
దుండిగల్, సెప్టెంబర్ 4: బంగారు భవిష్యత్ ఉన్న ఆ యువకులను మృత్యువు కబళించింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన వారు..కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…మేడ్చల్ జిల్లా సూరారం వాసి ప్రమోద్‌రెడ్డి(23), వరంగల్‌కు చెందిన సునయ్రెడ్డి(22) స్నేహితులు. కెనడా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్నారు. ఇందుకు సంబంధించిన పరీక్ష సైతం రాశారు. కెనడా వెళ్లే ప్రయత్నంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లు చర్చించేందుకు సునయ్రెడ్డి శుక్రవారం వరంగల్ నుంచి నగరానికి వచ్చాడు. సాయంత్రం ప్రమోద్, సునయ్రెడ్డి బైక్‌పై బాచుపల్లిలో ఉంటున్న మరో మిత్రుడిని కలిసేందుకు వెళ్లారు. రాత్రి మల్లంపేట మీదుగా బౌరంపేటలో ఉంటున్న మరో స్నేహితుడిని కలవాలనుకొని.. ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో ఎస్ఆర్కే గ్రీన్ విల్లాస్ సమీపంలో రహదారిపై నిలిపి ఉన్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి అతివేగంతో ఢీకొట్టారు. ప్రమాదంలో బైక్ నడుపుతున్న ప్రమోద్, సునయ్రెడ్డి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమోద్‌కుమార్ తల్లి శోభారాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇండికేటర్ వేయకుండా.. డీసీఎం డ్రైవర్ రోడ్డుపై వాహనాన్ని నిర్లక్ష్యంగా నిలుపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.