రామంతపూర్, మార్చి 2 : రామంతపూర్ ప్రభుత్వ హోమియో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చారబుడ్డి శ్రీనివాస్ రెడ్డిని డాక్టర్ మహేంద్ర సింగ్ మెమోరియల్ జాతీయ ఉత్తమ అధ్యాపక అవార్డు పురస్కారం వరించింది. ఆదివారం కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గత 34 ఏళ్లు హోమియో వైద్య రంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందుకున్నారు.
డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం వరంగల్ జిల్లా నెలపోగుల గ్రామం. ఆయన తన 34 ఏళ్ల కెరీర్లో గొప్ప వైద్యుడిగా, అధ్యాపకుడిగా, పరిశోధకుడిగతా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కాళోజీ నారాయణ రావు వైద్య యూనివర్సిటీకి, హోమియోపతి బోర్డు ఆఫ్ స్టడీస్కుచైర్మన్గా ఉన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ బోర్డు ఆఫ్ స్టడీస్‌కు ఎక్స్టర్నల్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. అలాగే జీఎస్పీఎస్ రామంతపూర్ హోమియో కాలేజీలో పీజీ కో ఆర్డినేటర్ గా ఉన్నారు.
శ్రీనివాస్ రెడ్డి కృషితో హోమియో వైద్య కళాశాల దేశంలోని ఉత్తమ కళాశాలల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నది. ఈయన దగ్గర చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాలలో ఉన్నత పదవులలో ఉన్నారు. ఆయన కృషి ని గుర్తించి ఈ బెస్ట్ టీచర్ అవార్డును ప్రదానం చేస్తున్నామని డాక్టర్ మహేంద్ర సింగ్ అవార్డ్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ సుభాష్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది,విద్యార్థులు, హోమియో డాక్టర్ అందరు శ్రీనివాస రెడ్డి కి అభినందనలు తెలిపారు. తనకు అవార్డు రావడం పట్ల శ్రీనివాస్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.