మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 22 : వాటాలు అందరికీ..శిక్ష కొందరికేనా అన్న మాటాలు ఏసీబీ దాడి జరిగిన ప్రతిసారి వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేసి, ఏసీబీ వలలో చిక్కిన ప్రతి సందర్భంలోనూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వారు మాత్రమే బలి అవుతున్నారు. అందులో ప్రోద్బలం ఉన్న వారు, వాటాలు తీసుకునే వారు మాత్రం తప్పించుకుంటున్నారు. నాగారం మున్సిపాలిటీలో సోమవారం జరిగిన ఏసీబీ దాడిలో డీఈఈ, వర్క్ ఇన్స్పెక్టర్లు పట్టుబడిన ఘటనలో ఈ విషయమై మున్సిపాలిటీలో చర్చనీయాంశంగా మారింది.
నాగారం మున్సిపాలిటీ పరిధిలో రూ. 11 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్ రమేశ్ నుంచి 16 శాతం వాటా కింద రూ. 1.30 లక్షలు డిమాండ్ చేశారు. తెరపై డీఈఈ, వర్క్ ఇన్స్పెక్టర్లు ఉండటంతో కాంట్రాక్టర్ ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వారిని వలవేసి పట్టుకున్నారు. అయితే ఈ 16 శాతంలో ప్రతి తలకు ఇంత ఇవ్వాల్సి ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. వాటాల పంపిణీలో ఎవరి వాటా ఎంత అన్న దానిపై పేరు చెప్పడానికి ఇష్టంలేని కాంట్రాక్టర్ వెల్లడించాడు. 16 శాతంలో కేవలం 3 శాతం డీఈఈ, ఒక శాతం వర్క్ ఇన్స్పెక్టర్లకు ఉంటుందని, మిగితా 12 శాతంలో మూడు శాతం కమిషనర్‌కు, ఏఈ రెండు శాతం, అకౌంటెంట్‌కు 2 శాతం, చైర్మన్ 3 శాతం, 2 శాతం కౌన్సిలర్లకు ఉంటుందని వెల్లడించాడు. పాలకవర్గ పదవీకాలం ముగియడంతో 5 శాతం కూడా అధికారులు, సిబ్బందే పంచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్ట్‌ల వాటాల్లోనే అరికడితే ఇప్పుడు నిర్వహించే పనులు నాణ్యవంతంగా జరిగి, ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంటుందని ప్రజల్లో చర్చ జరుగుతుంది. సోమవారం నాటి ఘటనలో ముగ్గురి మాత్రమే బలి అయితే వాటాలు పొందే వారి మిగితా పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తతున్నాయి. అధికారులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులందరిని తెరపైకి తీసుకువస్తే లంచాల జబ్బును అరికట్టవచ్చని పలువురు సూచిస్తున్నారు.