Hyderabad | మూసాపేట, మార్చి4: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుంచి చిన్న చిన్న సిలిండర్లలో అక్రమంగా గ్యాస్ నింపుతుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ అమీర్‌లో శంకర్ అనే వ్యక్తి జయభవానీ గోల్డెన్ ఇన్ఫోసిస్టమ్ ఎలక్ట్రికల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ షాపును నిర్వహిస్తున్నాడు. డొమెస్టిక్ సిలిండర్ల నుంచి చిన్న చిన్న గ్యాస్ సిలిండర్లలో అక్రమంగా గ్యాస్‌ను రీఫిలింగ్ చేసి విక్రయిస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం నాడు రీఫిలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో షాపు నిర్వాహకుడు శంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ పేలుడు ధాటికి షాపు మొత్తం శిథిలమైంది. పేలుడు శబ్దానికి చుట్టుపక్కల నివసించే వారు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు షాపును పరిశీలించారు. క్షతగాత్రుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.