ఉప్పల్, జూలై 18: నాచారంలోని అన్నపూర్ణ కాలనీలో భూమికి సంబంధించిన విషయంలో కాలనీవాసుల ఫిర్యాదు మేరకు పలు విభాగాల అధికారులు సర్వే నిర్వహించారు. జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్, ఇండస్ట్రియల్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి శుక్రవారం జాయింట్ సర్వే చేపట్టారు. అన్నపూర్ణ కాలనీలో ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, పారిశ్రామిక ప్రాంతంలోని బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణల నేపథ్యంలో మూడు విభాగాల అధికారులు సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్వేనెంబర్ 105, 106,107, 14 సర్వే నెంబర్లు ఉన్న భూములతో పాటు పారిశ్రామిక ప్రాంతానికి చెందిన భూములను పరిశీలించారు. ఈ మేరకు సర్వే రిపోర్ట్ రూపొందిస్తున్నామని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ రెవెన్యూ అధికారులు సునీల్, ఇండస్ట్రియల్ అధికారులు భరత్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.