ఘట్కేసర్: భవిషత్లో నీటి కొరతను అధిగమించేందుకు అధనపు నీటి ట్యాంక్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ మెట్రో వాటర్ సరఫరా విభాగం డిజిఎం కార్తిక్ రెడ్డి తెలిపారు. బుధవారం పోచారం మున్సిపాలిటీలోని ఎల్ఐజి కాలని, పోచారం ప్రాంతాల్లో కొత్త నీటి ట్యాంక్ నిర్మాణానికి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భవిషత్లో నీటి కొరతను రానివ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ఇందుకోసం అవుటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీల్లో కొత్త నీటి ట్యాంక్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న నీటి ట్యాంక్‌లు కాకుండా అధనంగా నిర్మించే ఈ ట్యాంక్‌లను భవిషత్ అవసరాలను దుష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శివారు మున్సిపాలిటీల ప్రాంతాలకు ప్రస్తుతం ప్రతిరోజు తాగునీటిని సరఫరా చేస్తున్నామని, ఏదైనా సమస్య ఉంటే మరుసటి రోజు నీటిని అందిస్తున్నామని ఆయన వివరించారు.
సమస్యలు ఏర్పడినప్పుడు మున్సిపాలిటీ అధికారులకు సమాచారం అందించి నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు. ఈ విధానంతో మున్సిపాలిటీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ప్రజలకు నీటి కొరత లేకుండా చేసే అవకాశం ఏర్పడుతుందని డిజిఎం కార్తిక్ రెడ్డి వివరించారు.