Jagadgirigutta | జగద్గిరిగుట్ట, మార్చి 22: అభివృద్ధి కోసం జరుగుతున్న నిర్మాణం చూసి అనందపడాలో.. అడ్డంకులతో నింపాదిగా పనులు చేస్తున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి జగద్గిరిగుట్ట ప్రాంత వాహనదారులకు ఎదురవుతోంది. షాపూర్ నగర్ నుంచి జగద్గిరిగుట్ట వెళ్లే మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. లోతట్టుగా ఉన్న హెచ్ఎంటీ ఖాళీ స్థలంలో రూ కోటి నిధులతో ఆరు నెలల క్రితం బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. అయితే పనులు జరుగుతున్న చోట రోడ్డు డైవర్షన్ కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు సరిగ్గా లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో దుమ్మురేగి వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షంతో ఆ మార్గంలో వెళ్లే వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. రోడ్డు మధ్యలో నీరు నిలిచి మరింత ఇబ్బందిగా తయారైంది. రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం వద్ద వాహనాలు ఢీకొట్టకుండా బారికేడ్లు, సూచికలు ఏర్పాటు చేయలేదు. ప్రధాన బ్రిడ్జి పూర్తయినా ఇరువైపులా అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. సిమెంటు రోడ్డు కావడంతో దాన్ని పూర్తిచేసి బ్రిడ్జి అందుబాటులోకి తీసుకురావడానికి మరో రెండు నెలలు పట్టేలా కనిపిస్తోంది. పైగా మరో రెండు చోట్ల ఉన్న కల్వర్టుల విస్తరణకు నిధులు కేటాయించలేదు. ఈ క్రమంలో తాత్కాలిక రోడ్డును సరిచేయడంతో పాటు బ్రిడ్జి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు.