శామీర్పేట, మే 27: ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం చేస్తే సహించేంది లేదని రైతన్నలు హెచ్చరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తా వడ్లకు 42 కిలోలు తూకం వేస్తామని, ఏ గ్రేడ్ వడ్లకు బీ గ్రేడ్లో ధరలో డబ్బులు చెల్లిస్తానని చెప్పడంతో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తా ధాన్యానికి 41 కిలోలుగా తూకం వేసే నిర్వాహకులు రైస్ మిల్లర్లు ఒప్పుకోకపోవడంతో, 42 కిలోలు తూకం వేస్తామని, ఏ గ్రేడ్ వడ్లకు బీ గ్రేడ్ ధర చెల్లిస్తామని చెప్పారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా బస్తా వడ్లకు 41 కిలోలు తూకం వేస్తుండగా ఈ సంవత్సరం 42 కిలోలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 42 కిలోలు తీసుకోవడంతో సరికాదని తమ వడ్లకు బీ గ్రేడ్ ధర చెల్లస్తాననడం సరైన పద్దతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైని అధికారులు స్పందించి తమ వడ్లను సరైన ధరకి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనాలకు కిరాయి చెల్లించాల్సి వస్తుందని, వెంటనే కొనుగోలు కేంద్రం వద్ద నిలిచిపోయిన వడ్లకు తూకం వేసి కొనుగోలు చేయాలని కోరారు. ఈ విషయంపై నిర్వాహకులను సమాచారం కోరగా మేడ్చల్ జిల్లాలోనే ఈ సమస్య ఉందని జిల్లాలోని రైస్ మిల్లర్ల వద్ద కేటాయింపులు పూర్తి కావడంతో యాదాద్రి జిల్లాకు ధాన్యం పంపించడం జరుగుతుందన్నారు. యాదాద్రి రైస్ మిల్లర్ల నిబంధనలపై జిల్లా సహాయక సంఘం అధికారికి సమాచారం ఇవ్వడంతో తూకం వేయడం కొనుగోలు చేయడం కొంత సమయం నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాకు ధాన్యం పంపించడానికి అనుమతులు రాగానే కొనుగోళ్లు ప్రారంభిస్తామని తెలిపారు.