నాచారం, డిసెంబర్19 : నాచారం పారిశ్రామిక వాడలోని షాహీ ఎక్స్‌పోర్టు కంపెనీలో పని చేసే మహిళా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ నల్లికంటి సత్యం అన్నారు. మహిళా కార్మికులు తమ వేతనాలను పెంచాలని గత 13 రోజులుగా ధర్నా చేస్తున్నా షాహీ యాజమాన్యం పట్టించుకోక పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చె వరకు కార్మికులకు సిపిఐ పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు.
మహిళా కార్మికుల ధర్నా కు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ సంఘీభావం తెలిపినప్పుడు వారం లోగ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయినా కూడా యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈటి నరసింహ, వీఎస్ బోస్, ఉమా మహేష్, దామోదర్ రెడ్డి, ధర్మేంద్ర, సత్యప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.