కుత్బుల్లాపూర్, ఆగస్టు 24 : ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సకాలంలో తగు చర్యలు తీసుకొని తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన వివిధ కాలనీల ప్రతినిధులు, ఆయా సమస్యలపై వచ్చిన ప్రజా సమస్యలను తెలుసుకొని సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ఎవరూ అధైర్యపడకుండా ప్రతి ఒక్కరూ తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెనువెంటనే అధికారులు పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజలు ఉన్నారు.
దుండిగల్, ఆగస్టు 24 : బౌరంపేట గ్రామ అభివృద్ధికి దివంగత మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన సేవలు మరవలేనివని ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్యే శంభీపూర్ రాజు అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలో కృష్ణారెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.