దుండిగల్,ఆగస్టు 8 : తన జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలకు బదులుగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం చేపట్టి వికలాంగులకు ప్రత్యేక మోటార్ సైకిళ్లు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌రాజు స్పందించారు. మొత్తం 113 వాహనాలను అందించేందుకు ముందుకు వచ్చారు. ఇందుకు సంబంధించిన మోటార్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం నగరంలోని జలవిహార్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా వికలాంగులకు మంత్రి చేతుల మీదుగా ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు త్రీవీల్ మోటార్ సైకిళ్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆపదలో ఉన్న వారికి మంత్రి కేటీఆర్ ఆపద్భాందవుడిగా మారారన్నారు. ఎన్నో సేవాకార్యక్రమాలను చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. వికలాంగుల కోసం మంత్రి కేటీఆర్ చేపట్టిన ప్రత్యేక మోటార్ సైకిళ్ల పంపిణీలో తాము భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను ఇచ్చిన పిలుపు మేరకు ప్రత్యేక మోటార్ సైకిళ్లు సమకూర్చిన ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజులను కేటీఆర్ అభినందించారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.