కుత్బుల్లాపూర్, జూన్ 27 : కాలనీల అభివృద్ధిలో సంక్షేమ సంఘాల నేతలు భాగస్వాములు కావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఆదిత్య విల్లా గ్రాండ్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఇటీవల ఎన్నికైంది. ఈ సందర్భంగా కాలనీలో ఆదివారం సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. అనంతరం గతంలో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు రావడంతో కాలనీలో కూలిన ప్రహరీ గోడలను పరిశీలించి పునఃనిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నూతన సంక్షేమ సంఘం ప్రతినిధులతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.
సుభాష్‌నగర్ డివిజన్ చివరి బస్టాప్ వద్ద రూ. 24.50 లక్షలు, మైత్రీనగర్‌లో రూ. 10.50 లక్షలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ గుడిమెట్ల హేమలత సురేశ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆదివారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ రంగారావు, సీనియర్ నాయకులు మన్నె రాజు, వెంకటస్వామి పాల్గొన్నారు.