దుండిగల్, జూన్ 25 : దుండిగల్ మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి పరిచి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కేపీ. వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌రాజు అన్నారు. చైర్పర్సన్ సుంకరికృష్ణవేణి కృష్ణ అధ్యక్షతన శుక్రవారం జరిగిన దుండిగల్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిల్ ఆమోదించిన రూ.12కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులు, మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల నెలకొన్న సమస్యలపై చర్చించారు. అదే విధంగా జూలై 1నుంచి ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి కార్యాచరణపై చర్చించారు.
అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ దుండిగల్ మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా గండిమైసమ్మ జంక్షన్ అభివృద్ధి, మల్లంపేట, బౌరంపేట్ గ్రామాల్లో వర్షపునీటి కాలువల ఏర్పాటు, గాగిళ్లాపూర్‌లో వాటర్ ట్యాంక్ నిర్మాణం, కరెంట్ సరఫరా సమస్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం గతంలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ఈ ఏడాది జూలై 1నుంచి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని సూచించారు. కౌన్సిలర్లు వార్డు కమిటీ సమావేశాలు నిర్వహించి, స్థానికంగా నెలకొన్న సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, మున్సిపల్ వైస్‌చైర్మన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్ శంభీపూర్కృష్ణతో పాటు పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.
జీడిమెట్ల, జూన్ 25 : వరద నీటి నాలాల అభివృద్ధి కోసం అధికారులు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం సుభాష్‌నగర్ డివిజన్ పరిధి ఎస్‌ఆర్‌నాయక్‌నగర్, జనప్రియ సాయినెస్ట్ అపార్టుమెంట్, మోడీ బిల్డర్స్లలో ఉన్న వరద నీటి కాలువల అభివృద్ధిపై జోనల్ కమిషనర్ మమతతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలంలో వరద నీటి వల్ల ముంపు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు ఎస్‌ఆర్‌నాయక్‌నగర్ నుంచి జనప్రియ సాయినెస్ట్ అపార్టుమెంట్ ప్రధాన గేటు మీదుగా మోడీ బిల్డర్స్ వరకు నాలా పునర్నిర్మాణానికి అవసరమైన ప్రతి పాదనలు రూపొందించి పనులు చేపట్టాలన్నారు. అపురూపకాలనీ, ఎస్‌ఆర్‌నాయక్‌నగర్ బస్తీల సరిహద్దులో ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో ప్రజలకు ఉపయోగపడేలా ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ జి.సురేశ్‌రెడ్డి, ఉప కమిషనర్ రవీందర్‌కుమార్, ఈఈ కృష్ణచైతన్య, డీఈ పాపమ్మ, ఏఈ సురేందర్‌నాయక్ పాల్గొన్నారు.
సుభాష్‌నగర్ డివిజన్ పరిధి అపురూపకాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సందర్శించారు. అనంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. మాజీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి, సంక్షేమ సంఘం నాయకులు రమణ, తదితరులు పాల్గొన్నారు.