దుండిగల్/ కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 12 : సమిష్టిగా ఉంటూ పార్టీని మరింత పటిష్టవంతం చేసుకునేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం, కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని ఆయా డివిజన్లలో బస్తీ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆయా కమిటీలను పరిశీలించి అందరికీ సముచిత స్థానం కల్పించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉన్నదన్నారు. కార్యకర్తలను నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.