కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 15 : అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్, గాజుల రామారం సర్కిళ్లకు చెందిన ఇంజినీరింగ్ విభాగం అధికారులతో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎనిమిది డివిజన్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..జంట సర్కిళ్ల పరిధిలో అన్ని డివిజన్లలో పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్డు, ప్రహరీ గోడ నిర్మాణ పనులను చేపట్టేందుకు సర్కిల్ కు 7 కోట్ల రూపాయల చొప్పున దాదాపు 14 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వేలకోట్ల రూపాయల నిధులు వెచ్చించి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, ఇంకా అక్కడక్కడ మిగిలిపోయిన పనులను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించి సమస్య పరిష్కారానికి కృషిచేయాలన్నారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి సామాన్య ప్రజలకు ఎటువంటి అసౌకర్యంగా కలగకుండా చూడాలని తద్వారా నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా నిలిపేందుకు అధికారులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే జంట సర్కిళ్ల పరిధిలోని వివిధ కాలనీలలో మంచినీటి సరఫరా, నీటి లభ్యత, భూగర్భ డ్రైనేజీ పనులు, నూతన పైప్ లైన్ల నిర్మాణము వంటి వాటిపై జలమండలి అధికారులతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో ఇంజనీరింగ్ ఈఈలు లక్ష్మి గణేష్, డీఈ పాపమ్మ, శిరీష, రూపా దేవి, ఏఈలు కళ్యాణ్, తిరుపతి, అనురాగ్, అశోక్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.