మేడ్చల్ : సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరిగిందని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy ) అన్నారు. బుధవారం నాగారం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో నంబర్ వన్‌గా ఉందని పేర్కొన్నారు.
రైతులకు రైతు బంధు( Raitu Bandu) , రైతు బీమాతో పాటు రుణమాఫీ చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్( CM KCR ) అని కొనియాడారు. దళిత బంధు, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్లకు లక్ష ఆర్థిక సహాయం అందించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఆసరా (Aasara) పెన్షన్లు రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు.
మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరు చేసిన కోట్ల రూపాయలతో సీవరేజ్ పైప్‌లైన్ పనులు, సిమెంట్ రోడ్లు, అంతర్గత మురికి కాలువలు, వైకుంఠధామాలు, చెరువులు సుందరీకరణ, లింక్ రోడ్ల విస్తరణ పనులు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, కమిషనర్ రాజేంద్రకుమార్, కార్పొరేటర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.