బోడుప్పల్, ఆగస్టు8: కరోనాతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగలేదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం బోడుప్పల్ నగరంలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం 9గంటలకు చెంగిచర్ల కాకతీయ కాలనీలో పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్ పాల్గొని పూజలు చేశారు. అనంతరం బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.
రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బోడుప్పల్ పర్యటనలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నగర పరిధిలోని 51మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో బంగారు తెలంగాణ దిశగా దూసుకెళ్తున్నదని తెలిపారు.
రాష్ట్రంలోనే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. నగర పరిధిలోని 11వ డివిజన్లో రూ.2.20కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆదివారం మేయర్ బుచ్చిరెడ్డి, కార్పొరేటర్ కొత్త శ్రీవిద్య చక్రపాణిగౌడ్తో కలిసి ప్రారంభించారు. కాలనీ అధ్యక్షుడు స్వామి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ… ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడదని, ఒక డివిజన్‌లోనే రూ.2.20కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులే నిదర్శనమన్నారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ మిషన్ భగీరథకు రెండో విడుతగా రూ.1500కోట్లు మంజూరు చేశారని తెలిపారు.
బోడుప్పల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ రూ. 80కోట్లతో రాష్ట్రంలోనే ముందంజలో ఉందన్నారు. తిరుమలా మెడోస్, లక్ష్మీగణపతికాలనీ, హేమానగర్ కాలనీల్లో నెలకొన్న స్థానికంగా సమస్యలను వారంలో పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు చందర్‌గౌడ్, పద్మారెడ్డి, చీరాల నర్సింహ, సుమన్‌నాయక్, మహేశ్వరి, నాయకులు దర్గ దయాకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, కాలనీ ప్రతినిధులు సంతోష్‌రెడ్డి, స్వామి, వెంకట్‌గుప్తా, శ్రీనివాస్ గుప్తా, ఆంజనేయులు, రామన్ పాల్గొన్నారు.