సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలను ‘మహా గ్రేటర్’లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సామాన్యుల పాలిట శాపంగా మారింది. విలీన ప్రక్రియ జరిగి నెలన్నర రోజులు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో పాలన మాత్రం ఎకడి వేసిన గొంగళి అకడే అన్నట్లుగా ఉంది. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో కలిపేసిన పాలకులు, ఆ తర్వాత పౌర సేవలను గాలికొదిలేశారు.
ఫలితంగా నిర్మాణ అనుమతుల నుంచి జనన, మరణ ధ్రువీకరణ పత్రాల దాకా ప్రతి చిన్న పనికి జనం నానా అవస్థలు పడుతున్నారు. సొంత ఇంటి కల నెరవేర్చుకుందామనుకునే మధ్యతరగతి ప్రజలకు నిర్మాణ అనుమతులు ఇప్పుడు పెద్ద ప్రహసనంగా మారాయి. విలీనానికి ముందు స్థానిక మున్సిపాలిటీల్లో సులభంగా వచ్చే అనుమతులు, ఇప్పుడు జీహెచ్ఎంసీ – హెచ్ఎండీఏ పరిధిల మధ్య నలిగిపోతున్నాయి. ఏ కార్యాలయానికి వెళ్లినా డేటా అప్ డేట్ కాలేదు.. రికార్డులు ఇంకా మా దగ్గరకు రాలేదు అంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు.
మరికొన్ని చోట్ల అనుమతులు రిలీజ్ చేసేందుకు అవసరమైన డిజిటల్ కీ (ఆన్లైన్ లాగిన్) ఇవ్వలేదని టౌన్‌ప్లానింగ్ అధికారులు సమాధానం చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోయి, రియల్ ఎస్టేట్ రంగానికి కూడా గొడ్డలిపెట్టుగా మారింది. ప్రధానంగా మణికొండ, బండ్లగూడ, తుక్కుగూడ, బోడుప్పల్ తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు భారీగా పెరుగుతుండడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది. ధ్రువీకరణ పత్రాల కోసం
ఒక వ్యక్తి చనిపోతే మరణ ధ్రువీకరణ పత్రం పొందడం ఇప్పుడు సవాల్‌గా మారింది. మీ-సేవా కేంద్రాలకు వెళ్తే ‘సర్వర్ డౌన్’ లేదా ‘విలీన ప్రాంతాల ఆప్షన్ ఇంకా రాలేదు’ అనే సమాధానం వస్తోంది. జీహెచ్ఎంసీ సరిల్ ఆఫీసులకు వెళ్తే పాత మున్సిపాలిటీ రికార్డులు ఇంకా డిజిటలైజేషన్ కాలేదు.. మా దగ్గర లాగిన్ ఐడీలు లేవు అంటూ సిబ్బంది తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు, పెన్షన్లు, వారసత్వ ధ్రువీకరణ పత్రాల కోసం రోజుల తరబడి వేచి చూస్తున్నామని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనన ధ్రువీకరణ పత్రాలు లేక పిల్లల సూల్ అడ్మిషన్ల సమయంలో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. సాంకేతికతలో దూసుకుపోతున్నామని చెబుతున్న సరార్, కనీసం విలీనమైన ప్రాంతాల రికార్డులను ఆన్లైన్ చేయడంలో విఫలమైందన్న ఆరోపణలు ఉన్నాయి.. పాత మున్సిపాలిటీల డేటాను సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానించడంలో జాప్యం జరుగుతుండటంతో అధికారులకు సాకులు చెప్పడానికి అవకాశం దొరికింది. ఆస్తి పన్ను లెకింపులో కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకే ప్రాంతంలో రెండు రకాల పన్నువిధానాలు ఉండటంతో జనం తలలు పట్టుకుంటున్నారు.
విలీనం తర్వాత రోడ్లు బాగుపడతాయని, డ్రైనేజీ సమస్యలు తీరుతాయని ఆశించిన శివారు వాసులకు నిరాశే మిగిలింది. బడ్జెట్లో వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటనలు ఇస్తున్నా, క్షేత్రస్థాయిలో గుంతల రోడ్లు, అస్తవ్యస్తమైన నాలాలే దర్శనమిస్తున్నాయి.. పన్నులు మాత్రం గ్రేటర్ స్థాయిలో వసూలు చేస్తూ, సేవలు మాత్రం కనీస స్థాయిలో కూడా అందించడం లేదని విలీన ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు. మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.