ఘట్కేసర్, జూన్ 27 : గ్రామీణ ప్రాంత క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్‌లో టీఆర్ఎస్ యువజన నాయకుడు ఓంప్రకాశ్‌రెడ్డి, మధుసూదన్ రెడ్డి ఏర్పాటు చేసిన క్రికెట్ గ్రౌండ్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంత క్రీడలను, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించి ఆదరిస్తున్నారని తెలిపారు. క్రీడలతో యువకులు శారీరకంగా ఎదగడమే కాకుండా, మానసికంగా ఉల్లాసాన్ని పొందుతారన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రౌండ్ల ఏర్పాటు, క్రీడాకారులకు పారితోషికాలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్నదని చెప్పారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద గుర్తిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్యయాదవ్, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.