సూర్యాపేట, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : దళితుడైన కర్ల రాజేశ్ పోలీసుల చిత్రహింసలతోనే చనిపోయాడని, దానికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ శనివారం చలో కోదాడకు పిలుపునిచ్చారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా పది వేలకు పైనే బీఆర్ఎస్ శ్రేణులు స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్త్తోంది. రాజేశ్ మృతిపై అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో మల్లయ్యయాదవ్‌తో పాటు దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేయనున్నారు. అగ్రకులాలకు చెందిన కోదాడ డీఎస్పీని కేవలం బదిలీ చేయడం, స్టేషన్‌హౌస్ ఆఫీసర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బీసీ అయిన ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా కోదాడలో మరీ దారుణంగా ఉందని మాజీ ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే అకారణంగా కోదాడ ఎంపీపీ ఇంటిపై దాడి చేశారని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల అనంతరం మునగాల మండలం నారాయణగూడెంలో ఓటమి చెందిన అభ్యర్థిపై దాడి చేశారన్నారు. మాల సంఘాలు రంగంలోకి దిగడంతో తప్పని పరిస్థితుల్లో పది రోజులకు కేసు నమోదు చేశారన్నారు. మాదవరంలోనూ వార్డు మెంబర్‌కు చెందిన వరిగడ్డి వాము తగలబెట్టడం, చిలుకూరు మండలం కొండాపురంలో గెలిచిన వారం తరువాత ఊరేగింపు చేస్తే తట్టుకోలేని వారు గ్రామంలో బీఆర్ఎస్ గద్దెను కూల్చారన్నారు. కోదాడలో అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు.
నేడు ఉత్కంఠగా మారిన చలో కోదాడ
కొద్ది రోజులుగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, దళిత సంఘాలు నిరసనలు, ఆందోళనలు చేస్తున్నా.. అధికారుల్లో ఎలాంటి చలనం కనిపించకపోవడంతో శనివారం కోదాడలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమానికి మల్లయ్యయాదవ్ పిలుపునిచ్చారు. దాదాపు పది వేలకు పైనే నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చేందుకు జనం సిద్ధమవుతున్నారు. మరోపక్క పోలీసులు 30 యాక్ట్ అమలులో ఉంది, ఎలాంటి నిరసనలు చేపట్టినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తుండడంతో శనివారంకోదాడలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా మారింది. ఉన్నతాధికారులు ఆదేశాలతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కోదాడకు తరలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది… రాత్రి ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు… హౌస్ అరెస్టులు చేయనున్నట్లు తెలిసింది.
పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది?
సామాన్యుడికి రక్షణ కల్పించలేని దుస్థితికి పోలీసు వ్యవస్థ వెళ్లిపోవడం దారుణమని బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కర్ల రాజేశ్ మృతి విషయంలో హత్య చేసిన వారికి ఎలాంటి నేరం ఉంటుందో, అదే శిక్ష బాధ్యులైన పోలీసు అధికారులకు ఉండాలని డిమాండ్ చేశారు. రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్న ఎస్ఐ సురేశ్‌రెడ్డి కేవలం తనను కేసులో ఇరికించాలనే కుట్రలతోనే చిత్ర హింసలకు గురి చేశారని, అది ఎవరి ఆదేశాలతో చేశారనేది తేలాల్సి ఉందన్నారు. రాజేశ్‌ది సాధారణ మరణం కాదని, అది పోలీసులు చేసిన హత్యే అని ఆరోపించారు. దళిత కుటుంబంలో ప్రాణం పోతే అంతకన్నా ఉద్యోగానికే విలువ ఎక్కువ ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాలతో ఓ బీసీ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారన్నారు. అగ్రకులానికి చెందిన డీఎస్పీని ప్రమోషన్‌తో బదిలీ చేస్తారా? స్టేషన్ హౌస్ ఆఫీసర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. రాజేశ్ హత్యకు కారకులైన ఎస్ఐ సురేశ్‌రెడ్డి, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.