హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ భూముల వివాదంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, రెవెన్యూ, సహకార, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శులు, సహకారశాఖ కమిషనర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీచేసింది. విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో రెవెన్యూ అధికారుల అవినీతిపై విచారణ చేపట్టాలని కోరుతూ సొసైటీ సభ్యుడు కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మాధవీదేవి విచారణ జరిపారు. సొసైటీ 1980లో ఏర్పడ్డాక తెల్లాపూర్‌లో 326.32, కొల్లూరులో 255.12, పటాన్చెరులో 412.12, అమీన్పూర్లో 294 ఎకరాల చొప్పున కొనుగోలు చేసిందని పిటిషనర్ న్యాయవాది వివరించారు.