మేడ్చల్, సెప్టెంబర్12(నమస్తే తెలంగాణ): దళితవాడల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మొదటి దశలో భాగంగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా రూ. 8 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులపై ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలలోని దళిత వాడల్లో ఉన్న సమస్యలను అధికారులు గుర్తించారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. ఇందులో సీసీరోడ్లు, కమ్యూనిటీ భవనాలు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేటాయించిన నిధుల నుంచి 20శాతం నిధులను దళిత వాడల అభివృద్ధికి కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు, దళిత వాడల, గిరిజనుల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులను కేటాయించనున్నారు.