ఢిల్లీ: పాకిస్థాన్ మూలాలున్న నలుగురు యూఎస్ఏ క్రికెటర్లకు వచ్చే నెలలో మొదలుకాబోయే టీ20 ప్రపంచకప్లో ఆడేందుకు భారత్ వీసా తిరస్కరించిందా? ఆ జట్టు క్రికెటర్లు పెట్టిన పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. వివరాల్లోకెళ్తే.. పొట్టి ప్రపంచకప్ కోసం యూఎస్ఏ 20 మంది సభ్యులతో కూడిన జట్టు ప్రస్తుతం కొలంబోలో సన్నాహక శిబిరంలో ఉంది. ఈ జట్టులో నలుగురు పాకిస్థాన్ మూలాలున్న క్రికెటర్లు (అలీ ఖాన్, జహంగీర్, మోహ్సిన్, ఇషాన్ అదిల్) ఉన్నారు. భారత్ తమకు వీసా తిరస్కరించిందని అలీ ఖాన్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.
అయితే దీనిపై కొలంబోలో ఉన్న భారత హై కమిషన్ స్పందిస్తూ.. వీసాలను తిరస్కరించలేదని, వారు పూర్తి సమాచారం అందించని కారణంగా వాటి జారీ జాప్యమవుతుందని తెలిపింది. సదరు క్రికెటర్లకు యూఎస్ పౌరసత్వం ఉన్నప్పటికీ వారు పుట్టింది మాత్రం పాక్లో కావున అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఇది ఒక్క యూఎస్ఏ క్రికెటర్లకే గాక సుమారు 7 (యూఏఈ, ఒమన్, నేపాల్, కెనడా, ఇంగ్లండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్) దేశాల క్రికెటర్లకూ ఇదే విధానం కొనసాగనుంది.