మేడ్చల్, ఆగస్టు15(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంచామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో ఆదివారం ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలియజేశారు. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో ఓఆర్ఆర్ వెలుపల ఉన్న గ్రామాలకు తాగునీటిని ప్రతి రోజూ సరాఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
టీఎస్ఐపాస్ ద్వారా మేడ్చల్ జిల్లా ఏర్పాటైన నాటి నుంచి 4,251 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు 4వేల 86 పరిశ్రమలు స్థాపించి 2 లక్షల 2వేల 5 వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, గ్రామీణ పారిశుధ్య కార్మికులు, పోలీసు, రెవెన్యూ యంత్రాంగం చేసిన సేవలు అభినందనీయమన్నారు. దళిత బంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలకు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు.
వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, పోలీస్‌కమిషనర్ మహేశ్ భగవత్, జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుణమాఫీ నిధులను మంత్రి మల్లారెడ్డి చెక్కు రూపంలో అందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన జిల్లా అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. పలు శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌తో కలిసి మంత్రి మల్లారెడ్డి సందర్శించారు.
మేడ్చల్ జిలా వైద్యాధికారి మల్లికార్జునరావు, ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాసమూర్తి, డీఎస్సీడీవో
వినోద్‌కుమార్, ఏవో వెంకటేశ్వర్రావు, కీసర, మల్కాజిగిరి ఆర్డీవోలు రవి, మల్లయ్య, ఏసీపీ శివకూమర్లు ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక కావడంతో వారికి మంత్రి మల్లారెడ్డి, సీపీ మహేశ్ భగవత్ ప్రశంసాపత్రాలను
అందజేశారు.