మేడ్చల్, ఆగస్టు14(నమస్తే తెలంగాణ) : నగరానికి అతి సమీపంలో ఉన్న మేడ్చల్ జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేయడంతో ఉద్యానశాఖ అధికారులు ఆ దిశగా చర్యలను వేగవంతం చేశారు. మేడ్చల్ మండల కేంద్రంలోని పూడురు గ్రామ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు రూ.5 కోట్లు మంజూరు చేశారు. త్వరలోనే నిర్మాణ పనుల కోసం టెండర్లను ఆహ్వానించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కూరగాయలు, పండ్ల ద్వారా జ్యూస్‌లు, గుజ్జు వెలికితీత, పచ్చడి ఇతరత్రా ఉత్పత్తులను తయారుచేసి ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. అంతేకాకుండా ఇక్కడ పండించిన కూరగాయలు, పండ్లను నిల్వ చేసుకుని మార్కెట్లో డిమాండ్‌ను బట్టి ఉత్పత్తి చేయనున్నారు.
త్వరలో ఏర్పాటు కానున్న ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ(సహకర యూనిట్) రైతు సహకార సంఘం ఆధ్యర్యంలో నడవనున్నది. ఈ యూనిట్ ద్వారా రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చు. రైతులకు స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారత సాధించడమే లక్ష్యంగా ఇండస్త్రీ ఏర్పాటుకు కృషి చేశాం. మంత్రులు మల్లారెడ్డి, నిరంజన్‌రెడ్డిలు ఇండస్ట్రీ ఏర్పాటులో పూర్తి సహకారం అందించారు. రైతుల తరఫున వారికి కృతజ్ఞతలు.
పూడురు గ్రామానికి చెందిన ‘ఆదర్శ రైతు సంఘం’ రైతులు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి రైతుల తరఫున ప్రత్యేకంగా మంత్రులు చామకూర మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిలతో సంప్రదింపులు జరిపి ఇండస్ట్రీ ఏర్పాటుకు రూ.5 కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం రైతు సంఘంలో 500 మంది రైతులు ఉండగా.. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
అధిక విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేసే మేడ్చల్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరయ్యాయి. రైతులు మరింత ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇండస్ట్రీ ఎంతో ఉపయోగపడుతుంది. త్వరలోనే టెండర్లను ఆహ్వానించి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.