మేడ్చల్, ఆగస్టు 14: పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఊరట కలిగిస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీకి చెందిన కే రంగారావుకు వైద్య సహాయం నిమిత్తం సీఎం సహాయనిధి ద్వారా చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి తన క్యాంపు కార్యాలయంలో శనివారం లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకోలేని పేదలకు సీఎం సహాయనిధి వరంగా మారిందన్నారు. నియోజకవర్గంలోని ఎంతో మందికి వైద్య సహాయం నిమిత్తం ఆర్థిక సహాయం అందజేసి సీఎం కేసీఆర్ ఆదుకున్నారని తెలిపారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు సందీప్ పాల్గొన్నారు.