జవహర్‌నగర్, ఆగస్టు 10: ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. జవహర్‌నగర్‌లో 62 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కమిషనర్ డాక్టర్ గోపి సమక్షంలో మంత్రి అందజేశారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయం మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జవహర్‌నగర్‌లో ఎక్కువ శాతం నిరుపేదలున్నారని, అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.
కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురంలో రూ. 30 లక్షలతో చేపట్టిన పట్టణ ప్రకృతి వనం ప్రహరీ నిర్మాణ పనులకు మంత్రి మల్లారెడ్డి, మేయర్ కావ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ రూపురేఖలు మార్చడానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నదని తెలిపారు. దశల వారీగా అన్ని డివిజన్లు అభివృద్ధి చెందుతాయన్నారు.కార్యక్రమంలో కాప్రా తాసీల్దార్ కె.గౌతమ్‌కుమార్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, డీఈ చెన్నకేశవులు, ఆర్ఐ రమేశ్, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.
కీసర: కీసర మండల పరిషత్ కార్యాలయం వద్ద 72 మంది లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాలను ఆదుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, తాసీల్దార్ గౌరీవత్సల, అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్: నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కార్యాలయాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి మల్లారెడ్డి మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలను సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అదుకుంటున్నారని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్లు ఎ.వాణిరెడ్డి, స్వామి, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.