ఘట్కేసర్/ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 5: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో హరితహారం మొక్కల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు.ఘట్కేసర్ మండల పరిధి అంకుషాపూర్‌లోని పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డులను మంగళవారం కలెక్టర్ హరీశ్ సందర్శించి పరిశీలించారు. ఇండ్లల్లో నుంచి సిబ్బంది సేకరించిన తడి,పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని సూచించారు. డంపింగ్ యార్డులో సెగ్రిగేషన్ ఎలా చేస్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రకృతి వనంలో పర్యటించి కూలీలు ఎంతమంది పని చేస్తున్నారు, రోజుకు ఎంత వేతనం చెల్లిస్తున్నారనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మాస్టర్ రోల్లో కూలీల పేర్లు సక్రమంగా నమోదు చేస్తున్నారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నెలకు మీ ఖాతాలో ఎన్ని డబ్బులు పడుతున్నాయని కూలీలను అడిగారు. హరితహారం విజయవంతం అయినప్పుడే రాష్ట్రంలో అటవీ సంపదను పెంచుకోగలుగుతామని చెప్పారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 193లోని అసైన్డ్ భూమికి పట్టదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని అసైన్డ్ పట్టాదారులు కలెక్టర్‌ను కోరారు. అదేవిధంగా పోచారం మున్సిపాలిటీలో కలెక్టర్ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు.
అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడేట్లుగా ఉండాలని సూచించారు. అంతకు ముందు మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలోని యాదాద్రి పార్కును పరిశీలించారు. అక్కడ నాటిన మొక్కలు, వాటి నిర్వహణను మున్సిపాలిటీ కమిషనర్ సురేశ్, చైర్మన్ కొండల్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. 12వార్డు సంస్కృతి టౌన్షిప్ వాకింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను కలెక్టర్ సందర్శించారు. టౌన్షిప్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయి. ఎంత మంది నివాసం ఉంటున్నారు. ఓపెన్‌జిమ్ ఇక్కడి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నదన్న అంశాలను కౌన్సిలర్ బి.హరిప్రసాద్,చైర్మన్ కొండల్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. 4వ వార్డులోని ఎస్టీ వైకుంఠధామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు.
వైకుంఠధామంలోని నిర్మిస్తున్న స్నానపు గదులు, దహన వాటిక, ప్రహరీ నిర్మాణం, మొక్కల పెంపకం వంటి విషయాలను వార్డు కౌన్సిలర్, వైస్‌చైర్మన్ రెడ్యానాయక్,చైర్మన్ కొండల్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా వైకుంఠధామాన్ని తీర్చిదిద్దాలని మున్సిపాలిటీ అధికారుల ను,ప్రజా ప్రతినిధులను కలెక్టర్ ఆదేశించారు.
అంకుషాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో డీఆర్డీఓ పద్మజారాణి, డీఎల్పీఓ స్మిత, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీఓ అరుణ, సర్పంచ్ జలజా సత్యనారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ కృష్ణాగౌడ్, సభ్యులు సరిత, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.ఘట్కేసర్లో కలెక్టర్ వెంట అడిషనల్ క లెక్టర్ శ్యాంసన్, మేనేజర్ నర్సింహులు, ఏఈ నరేశ్,కౌన్సిలర్లు మహేశ్, ధనలక్ష్మి, రాజశేఖర్, సాయిరెడ్డి, బాల్‌రెడ్డి, రవీందర్,కోఆష్షన్ సభ్యుడు అక్రం అలీ, టీఆర్ఎస్ నాయకులు జగన్మోహన్రెడ్డి, శేఖర్‌ముదిరాజ్,నర్సింహ,బుచ్చిరెడ్డి,ఎన్.కాశయ్యపాల్గొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని 3,4 వార్డుల్లోని లక్ష్మీనర్సింహకాలనీ డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కౌన్సిలర్ చింతల రాజశేఖర్ కలెక్టర్ హరీశ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ ప్రజలకు ఉపయోగ పడేపనులను తక్షణమే పరిష్కరించాలని, వెంటనే ఈ సమస్యకు సంబంధించిన రికార్డులు, మ్యాప్‌లతో కార్యాలయానికి రావాల్సిందిగా చైర్మన్ కొండల్‌రెడ్డి, కమిషనర్ సురేశ్‌ను కలెక్టర్ ఆదేశించారు.