మేడ్చల్, జూన్ 28(నమస్తే తెలంగాణ): కొండ పొచమ్మ జలాశయం నుంచి మేడ్చల్ జిల్లాకు సాగునీరు త్వరలోనే అందనున్నది. సాగునీటిని అందించే క్రమంలో చేపట్టిన భూ సేకరణ నోటిఫికేషన్ విచారణ (ఎంక్వయిరీ) పూర్తయింది. ప్రభుత్వం అవార్డును జారీ చేసిన నెలరోజులలో రైతులకు నష్ట పరిహారం అందించనున్నారు. కొండ పొచమ్మ జలాశయం నుంచి సాగు నీరు అందనుండటంతో జిల్లాలో నాలుగు వేల ఎకరాలకు సాగునీరంది సస్యశ్యామలం కానుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూ సేకరణ విచారణ (ఎంక్వయిరీ) పూర్తితో రైతులకు అందించే నష్ట పరిహారాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. సాగునీరు కాలువల ద్వారా రావడం వల్ల సమీపంలోని భూగర్భజలాలు పెరిగి రైతులకు మేలు జరగనుంది. కాలువల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.
కొండ పోచమ్మ జలాశయం నుంచి సిద్దిపేట జిల్లా మైలారం నుంచి మేడ్చల్ జిల్లా రావల్ కోల్ చెరువుకు సాగు నీరు చేరుకుంటుంది. కాలువల ద్వారా రావల్కోల్ నుంచి శామీర్పేట్ పెద్ద చెరువు, బురుగు చెరువులలో నింపుతారు. చెరువుల నుంచి పంటలకు సాగునీరు అందుతుంది. సాగునీటిని అందించే క్రమంలో కాలువల నిర్మాణాలకు కావాల్సిన 97 ఎకరాలను భూ సేకరణ చేశారు. రావల్కోల్లో 81 ఎకరాలు, శామీర్పేట్లో 16 ఎకరాల భూ సేకరణలో భాగంగా విచారణ (ఎంక్వయిరీ) పూర్తి అయినట్లు కీసర ఆర్డీవో రవి వెల్లడించారు. రైతులకు నష్ట పరిహార చెల్లింపులు పూర్తయిన వెంటనే కాలువ నిర్మాణ పనులను చేపట్టనున్నారు.
జిల్లాకు సాగు నీరందించేందుకు చేపట్టిన భూ సేకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూ సేరణలో రైతులు ఇచ్చిన భూములకు రావల్కోల్లోని రైతులకు ఎకరాకు రూ.28 లక్షలు, శామీర్పేట్ రైతులకు ఎకరాకు రూ.38 లక్షలుగా ప్రభుత్వం నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. రైతుల అంగీకారంతో ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లింపులపై నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికి జల ప్రధాయినిగా మారిందని రైతులు పేర్కొంటున్నారు. భూ సేకరణ విచారణ (ఎంక్వయిరీ) పూర్తితో రావల్కోల్, శామీర్పేట్ రైతులతో సోమవారం కీసర ఆర్డీవో ఎన్.రవి సమావేశమై వివరాలను తెలిపారు.