కుత్బుల్లాపూర్,ఆగస్టు25 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనుమానస్పదస్థితిలో వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్ఐ మల్లేశం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామానికి చెందిన బోగర్ల శ్రీకాంత్, శ్రావణి(22) దంపతులు తమ కొడుకు తనీశ్(1)తో కలిసి కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మానగర్ ఫేస్-2లో నివసిస్తున్నారు.
శ్రీకాంత్ కూరగాయల వ్యాపారం చేస్తుండగా.. శ్రావణి ఇంట్లోనే ఉంటుంది. గురువారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఇంట్లో తన భర్త పడుకొని ఉండగా శ్రావణి బాత్రూంకు వెళ్లి రాడ్డుకు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్‌టీం ఆధారంగా పలు ఆధారాలు సేకరించారు. భాదితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.