Marri Rajasekhar Reddy | కుత్బుల్లాపూర్, మే 17: మేడ్చల్ జిల్లా సుచిత్ర ప్రాంతంలోని సర్వే నంబర్ 82,83లో ఉన్న తమ భూమిలో ముందస్తు నోటీసులు లేకుండా, సమాచారం లేకుండా రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టడం చట్ట విరుద్ధమైన చర్య అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య సర్వే చేయడం తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ న్యాయపరంగా తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సర్వే చేపట్టడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్వే చేపట్టే 15 రోజుల ముందు స్థల యజమానికి నోటీసులు ఇవ్వాలని, కానీ అలాంటి వాటికి తావు ఇవ్వకుండా పోలీసుల పహారాలో అధికారులు అత్యుత్సాహంగా వ్యవహరించి సర్వే చేపట్టడం సరైంది కాదని అన్నారు. తాము న్యాయబద్ధంగా సర్వే నంబర్ 82, 83లో కొనుగోలు చేశామని తెలిపారు. దీనిపై కొంతమంది వ్యక్తులు దురుద్దేశపూర్వకంగా వ్యవహరించి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సరైందని కాదని చెప్పారు.