దుండిగల్, నవంబర్ 6: వేగంగా అభివృద్ధి చెందుతున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రహదారులను నిర్మించాలని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌రాజు అన్నారు. నియోజకవర్గంలోని మల్లంపేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై రూ.138 కోట్ల వ్యయంతో నిర్మించనున్నఎంట్రీ, ఎగ్జిట్ వేకు సంబంధించిన పనులను హెచ్ఎండీఏ అధికారులతో కలిసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శనివారం పరిశీలించారు. అనంతరం మల్లంపేట నుంచి బౌరంపేట మీదుగా బాచుపల్లి రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర శివారు ప్రాంతంలో ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుం డా శాశ్వత చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించి, నిధులు కేటాయించారన్నారు. బాచుపల్లి నుంచి మల్లంపేట మీదుగా బౌరంపేట వరకు రోడ్డు వెడల్పు పనులను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ ఎస్ఈ హుస్సేన్, ఈఈ రమేశ్, డీఈ విద్యాసాగర్, దుండిగల్ మున్సిపల్ కమిషనర్ భోగీశ్వర్లు, ఏఈ ప్రవీణ్, దుండిగల్ కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, నర్సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అర్కల అనంతస్వామి, మాదాసు వెంకటేశ్, బౌరంపేట పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్‌రెడ్డి, కార్పొరేటర్ చిట్ల దివాకర్ తదితరులు పాల్గొన్నారు.