మేడ్చల్, ఆగస్టు28(నమస్తే తెలంగాణ): కొండపోచమ్మ జలాశయం నుంచి మేడ్చల్ జిల్లాలో 10 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు రూపొందించిన ప్రణాళికను త్వరలోనే అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన పనులను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వేగవంతం చేశారు. జిల్లాకు సాగునీరందించే క్రమంలో కాలువలకు కావాల్సిన భూమి కోసం భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. శామీర్‌పేట్‌లో పంప్‌హౌజ్ నిర్మాణానికి భూ సేకరణకు సర్వేను ప్రారంభించనున్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. కొండపోచమ్మ జలాశయం నుంచి సిద్దిపేట జిల్లా మైలారం నుంచి మేడ్చల్ జిల్లా రావల్కోల్ చెరువు ద్వారా శామీర్‌పేట్ పెద్ద చెరువులో నీటిని నింపి పంప్‌హౌజ్ ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సాగునీటిని అందించనున్నారు. 10 వేల ఎకరాలకు సాగునీరందితే మేడ్చల్ జిల్లా సస్యశ్యామలం కానుంది.
రావల్కోల్ చెరువు నుంచి శామీర్‌పేట్ చెరువును నింపేందుకు కావాల్సిన కాలువల నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేశారు. దీనికి కావాల్సిన 91 ఎకరాలకు సంబంధించి భూ పరిహారం అందించేందుకు సంప్రందిపుల కమిటీ నిర్ణయం తీసుకుంది. అవార్డు (ఉత్తర్వులు) జారీ చేసిన తర్వాత భూ పరిహారం అందించనున్నారు. రావల్‌కోల్‌లో 80, శామీర్‌పేట్‌లో 11 ఎకరాలు రైతుల వద్దనుంచి భూమి సేకరించిన విషయం విధితమే.
భూ పరిహారం అందించిన వెంటనే కాలువల నిర్మాణం చేపట్టనున్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాలువల నిర్మాణానికి అవసరమయ్యే భూమిని ఇచ్చేందుకు అంగీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు జలప్రదాయనిగా మారింది.
శామీర్‌పేట్ పెద్ద చెరువు సమీపంలో పంప్‌హౌజ్ నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వేను ప్రారంభించారు. పంప్‌హౌజ్ నిర్మాణం చేపట్టి పైపులైన్ల ద్వారా సాగునీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కాలువలతో పాటు పైపులైన్ల నిర్మాణాల ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సాగునీటిని అందించనున్నారు. మేడ్చల్ జిల్లాలోని 10 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు యాదాద్రి జిల్లాకు శామీర్‌పేట్‌లో నిర్మించనున్న పంప్‌హౌజ్ ద్వారా పైపులైన్లతో సాగునీటిని అందించనున్నారు. పైపులైన్ల ద్వారా సుమారు 22 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రణాళికను రూపొందించారు. అయితే పైపులైన్ల నిర్మాణాలకు భూ సేకరణకు నిమిత్తం లేకుండా రోడ్డుకు ఇరువైపుల పైపులైన్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు.