శామీర్పేట, మే 27 : కలుషిత రసాయన వ్యర్థాల నుంచి తమను, తమ గ్రామాన్ని కాపాడాలని కొల్తూరు ప్రజలు విజ్ఞప్తిచేశారు. జీనోవ్ వ్యాలీ వ్యర్థాల నుంచి తమ గ్రామాన్ని కాపాడాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.
జీనోమ్వాలీ పరిధిలోని తుర్కపల్లి, కొల్తూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థ జలాలతో నీటి కాలుష్యం, భూమి కాలుష్యంతో పాటు ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికవాడ నుంచి కంపెనీల యాజమాన్యం పటేల్ కుంటలోకి పరిశ్రమల వ్యర్థాలను వదులుతున్నారని ఆరోపించారు. ఆ నీరు కాలువ ద్వారా పెద్ద చెరువులోకి వస్తున్నాయని, నీటి ప్రవాహంతో కాలువ పరిసర ప్రాంతాల ఇండ్లలో దుర్వాసన వెదజల్లుతుందని చెప్పారు. దీంతో ప్రజలు తీవ్ర ఆనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.
పటేల్కుంట కట్టను ఓ కంపెనీ యాజమాన్యం సగం వరకు తొలగించి నిర్మాణాలు చేపడుతుందని గ్రామస్థులు ఆరోపించారు. ఆ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని కొల్తూర్ గ్రామాన్ని, ప్రజలను కాపాడాలని కోరారు.