పోచారం, ఫిబ్రవరి28 : పోచారం మున్సిపాలిటీలో ఆక్రమ నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ నుంచి అనుమతి పొందిన దానికంటే ఎక్కువ ఫ్లోర్లను నిర్మించి మున్సిపాలిటీ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ పరిస్థితి మున్సిపాలిటీ పరిధిలోని ఇన్ఫోసిస్ పక్కన ఇస్మాయిల్‌ఖాన్‌గూడ,యంనంపేట, నారపల్లి, చౌదరిగూడ, పోచారం తదితర ప్రాంతాలలో అధికంగా ఉన్నాయి. మున్సిపాలిటీ నుంచి జీ ప్లస్ 2 ఫ్లోర్‌కు అనుమతి తీసుకొని యజమానులు 4,5 ఫ్లోర్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇది మున్సిపాలిటీ ఆదాయానికి తీవ్రంగా నష్టం కలిగిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న దాదాపు 200 నిర్మాణాలలో 50 శాతం మున్సిపాలిటీ అనుమతి వరకు నిర్మిస్తున్నా, మరో 50 శాతం నిర్మాణాలు తీసుకున్న అనుమతులకు విరుద్దంగా ఎక్కువ ఫ్లోర్లను నిర్మిస్తున్నా పట్టించుకునే వారు లేకపోవడంతో నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి.
వరంగల్ రోడ్డుపై పుట్‌పాత్‌ను ఆనుకొని నిర్మాణాలు
వరంగల్ ప్రధాన రహదారి పోచారం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో పుట్‌పాత్‌ను ఆనుకొని రెండు వైపులా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీంతో పుట్‌పాత్ నుంచి వెళ్లే పాదాచారులకు సమస్యలు ఎదురవుతున్నాయి.ఈ పరిస్థితిని మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోకపోవడంతో నిర్మాణదారులు యథేఛ్చంగా పుట్‌పాత్‌ను ఆనుకొని నిర్మాణాలు చేపడుతున్నారు. వరంగల్ రోడ్డుపై ఉన్న నారపల్లి, జీడిమెట్ల, తదితర ప్రాంతాలలో కొనసాగుతున్నాయి.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం: కమిషనర్ వీరారెడ్డి
పోచారం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ వీరారెడ్డి తెలిపారు. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలు గుర్తించామని, 50 శాతం నిర్మాణాలు తీసుకున్న అనుమతుల కంటే ఎక్కువ ఫ్లోర్లు నిర్మిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీలోని అక్రమ నిర్మాణాలను విషయాన్ని హైడ్రా దుష్టికి తీసుక పోవాలా,లేక నోటీసులు ఇచ్చి అరికట్టాలా అని అలోచిస్తున్నట్లు కమిషనర్ వివరించారు.