MLA KP Vivekanand | దుండిగల్, మార్చి 19: విశ్వ నగరాభివృద్ధిని బడ్జెట్లో పూర్తిగా విస్మరించారనీ బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్లో మహానగరాభివృద్ధిపై దృష్టి సారించకపోవడంపై ఆయన మండిపడ్డారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో కేపీ వివేకానంద్ మాట్లాడుతూ.. మహానగరాన్ని నలుమూలల అనుసంధానం చేస్తూ ఎంతోమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే హైదరాబాద్ మెట్రోకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు.
హైదరాబాద్ నగరానికి ప్రతీ సంవత్సరం రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాటలు చెప్పడానికే కానీ చేతల్లో ఉండవని మరోసారి నిరూపిస్తూ హైదరాబాద్ నగరాభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం అంటే ముఖ్యమంత్రి నగరవాసులను తీవ్రంగా అవమానించినట్లే భావిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టి, పూర్తిచేసిన ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డీపీ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటు.
బీఆర్ఎస్ పార్టీ ద్వారానే హైదరాబాద్ మహా నగర అభివృద్ధి..
తెలంగాణను పూర్తి ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శంకుస్థాపన చేసిన మల్టీస్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. దీంతో నిరుపేదలకు అందాల్సిన మెరుగైన వైద్యం మరింత ఆలస్యం కానుంది.
ఉన్న నగరాన్ని విస్మరించిన ముఖ్యమంత్రి తన ఊహల నగరమైన ఫ్యూచర్ సిటీ కోసం నిధులను కేటాయించడాన్ని చూస్తుంటే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ప్రజలను మోసం చేయడానికి వేసిన ఒక ఎత్తుగడ మాత్రమే గానీ, అభివృద్ధి సంక్షేమం గురించి ఎంత మాత్రం కాదనీ స్పష్టమవుతుందన్నారు. దీంతో హైదరాబాద్ నగర అభివృద్ధిపై సీఎంకు ఎంత మాత్రం ప్రేమ లేదని బడ్జెట్తో తేలిపోయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారానే హైదరాబాద్ మహా నగర అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు.