మేడ్చల్ కలెక్టరేట్, మే 30: గ్రామ పంచాయతీల్లో ఇంటి నెంబర్లు అదృశ్యం అయ్యాయి. ఎన్నో ఏండ్ల పాటు తమకు ఇచ్చిన నెంబరుపై ఆస్తి పన్ను చెల్లించనప్పటికీ మున్సిపాలిటీకి వచ్చే వరకు ఆ నెంబర్ల కన్పించడం లేదు. ఇదేమిటని అడిగితే మళ్లీ నెంబర్లు తీసుకోవాలని అధికారులు చెపుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. నాగారం మున్సిపాలిటీలో ఇటీవల ప్రభుత్వం కీసర మండలంలోని గోధుమకుంట, కరీంగూడ, రాంపల్లి దాయర, భోగారం గ్రామాలను విలీనం చేసింది. పంచాయతీల్లో ఉన్నప్పుడు ఆయా గ్రామాల్లో నిర్మించుకున్న ఇండ్లకు ఇంటి నెంబర్లు కేటాయించారు. పంచాయితీల్లో అసెస్మెంట్ చేసిన ప్రకారం పన్నులు కూడా చెల్లిస్తూ వచ్చారు అయితే గ్రామాలు మున్సిపాలిటిలో విలీనం అయిన తర్వాత మాత్రం కొన్ని ఇంటి నెంబర్లు మున్సిపాలిటీల్లో కనిపించడం లేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామ సర్పంచ్‌లు నకిలీ రశీదులు ముద్రించి, ఇండ్ల యాజమానులు చెల్లించిన డబ్బులను స్వాహా చేసి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులను ఇంటి నెంబర్ల అదృశ్యంపై అడిగితే ఆన్లైన్ కన్పించకపోతే మళ్లీ ఇంటి నెంబరు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. పన్ను కట్టేందుకు పలువురు ఇంటి యజమానులు ఆన్లైన్లో చూడగా కనినిపించపోవడంతో అయోమయానికి గురై మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కొంత మంది అయితే మళ్లీ ఇంటి నెంబరు తీసుకొని, అసెస్మెంట్లు చేయించుకోగా మరికొంత మంది మాత్రం చెల్లించిన రశీదులను అధికారుల వద్దకు తీసుకెళ్లి, మళ్లీ ఇంటి నెంబరు ఎందుకు తీసుకుంటామని వాగ్వాదానికి దిగుతున్నారు.
గోధుమకుంట గ్రామ పరిధిలోని శివసాయి ఎన్‌క్లేవ్‌లో దాదాపు 20 వరకు ఇంటి నెంబర్లను కనిపించడం లేదు. ఆ వెంచర్‌లోని వారు మధ్య దళారులను పెట్టుకొని, ఇంటి నెంబరు తీసుకొని, ఆన్లైన్లో నమోదు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే గతంలో పంచాయతీ కార్యదర్శుల నిర్వాకం కారణంగా ఆన్లైన్లో నమోదు కాకపోతే, ఇప్పుడు మున్సిపాలిటీల్లో నెంబరులేని వారిని గుర్తించి, నెంబర్ల కేటాయించాల్సిన అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, ఇంటి నెంబరు లేని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నెంబరు కేటాయించాలని చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.