Girl Assault Case | మేడ్చల్, ఏప్రిల్ 7 : ఓ వ్యక్తి యువతిపై లైంగిక దాడికి యత్నించగా.. అతడి తలపై రాయితో కొట్టి యువతి తప్పించుకున్న ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సదరు యువతి(19) గత కొంత కాలంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో యువకుడితో కలిసి సహజీవనం చేస్తుంది.
ఆదివారం రాత్రి ఇద్దరి మద్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆ యువతి గుండ్లపోచంపల్లి నుంచి రైల్వే ట్రాక్‌పై మేడ్చల్ వైపు నడుచుకుంటూ వస్తుండగా గౌడవెళ్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి తనపై అత్యాచారానికి యత్నించాడని.. దీంతో అతడి తలపై రాయితో బాది అక్కడి నుంచి తప్పించుకుని వచ్చానంటూ బాధిత యువతి అదే రోజు రాత్రి మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది.
యువతి ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటన స్థలికి వెళ్లి పరిశీలించారు. రైల్వే ట్రాక్‌పై ఘటన జరగడంతో మేడ్చల్ పోలీసులు కేసును సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు బదలాయించారు.
ఘటన రైల్వే ట్రాక్‌పై జరగడంతో..
ఈ విషయమై సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ..ఆదివారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఓ యువతి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసిందన్నారు. వివరాలు సేకరించి ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సంఘటన స్థలికి వెళ్లి పరిశీలించామని, ఘటన రైల్వే ట్రాక్‌పై జరగడంతో రైల్వే పోలీసులకు కేసు బదిలీ చేశామన్నారు.
యువతి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. యువతి ఫిర్యాదులో తెలిపినట్లు వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడా లేదా..? రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ రావడానికి గల కారణాలు తదితర వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. రైల్వే పోలీసులకు కేసు దర్యాప్తులో సహకారం అందిస్తామని అన్నారు. కాగా సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.