కుత్బుల్లాపూర్,మే29 : సుభాష్‌నగర్ డివిజన్ పైపులైన్ రోడ్డు మార్గంలో ఉన్న ఓ మెకానిక్ కారు షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. తిరుమల వైన్స్ ఎదురుగా ఉన్న ఓ కారు మెకానిక్ షెడ్డులో కరెంటు షార్ట్‌సర్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.
అప్పటికే మెకానిక్ షెడ్డులో ఉన్న కొన్ని కార్లు స్వల్పంగా అగ్నికి ఆహుతికావడంతో పాటుగా పొగతో స్థానిక ప్రాంతమంతా పొగ కమ్మేయడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా ప్రమాదం జరిగిన మెకానిక్ షెడ్డుకు ఆనుకొని ఒక ఐదంతస్తుల భవనంతో పాటు ఫర్నిచర్ దుకాణం, ఇతర షాపులు ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరి మంటలు ఆర్పేయడంతో ఏలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.