శామీర్ పేట, ఫిబ్రవరి 23 : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. వ్యవసాయ పొలంలో యూరియా మందు చళ్ళుతుండగా కొడుకుకు విద్యుత్ షాక్ తగలగా కాపాడే ప్రయత్నంలో తండ్రి మృత్యువాత పడిన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మూడుచింతలపల్లి మండలం అనంతారం గ్రామానికి చెందిన బుద్ది వెంకటేశ్( 40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పంట పొలానికి యూరియా చల్లేందుకు ఆదివారం తన కుమారుడు సృజన్‌ను తీసుకుని వెళ్లాడు. తండ్రి యూరియా చల్లుతుంటే కొడుకు గంపలో యూరియా అందిస్తున్నాడు. ఈ క్రమంలో వరి గట్టుపై నడుస్తున్న సమయంలో సృజన్‌ను ఎత్తుకున్న గంప.. పొలంలో వెళ్లాడుతున్న విద్యుత్ వైర్లకు తగిలింది. దీంతో సృజన్ ఒక్కసారిగా కేకలు వేశాడు. ఈ క్రమంలో కొడుకును కాపాడేందుకు వెళ్లిన వెంకటేశ్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
ఇది గమనించిన స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వెంకటేశ్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో సృజన్ భుజంపై ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, విద్యుత్ వైర్ల సమస్యపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ వైర్ల సమస్యను స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు.