Domara Pocham Pally : దొమ్మర పోచంపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని బహదూర్ పల్లిలో ఓ లైన్మెన్ కరెంట్ షాక్కు గురయ్యాడు. విధి నిర్వహణలో భాగంగా మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ కారణంగా తీవ్ర గాయాలపాలైన అతడు మృత్యువుతో పోరాడుతున్నాడు. దొమ్మర పోచంపల్లి సబ్ స్టేషన్లో లైన్మెన్గా పనిచేస్తున్న శ్రీనివాస్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
అసలేం జరిగిందంటే.. సోమవారం ఉదయం బహదూర్ పల్లిలోని ఓ ఫీడర్ షట్ డౌన్ అయింది. స్థానికులు ఫిర్యాదు అందుకున్న శ్రీనివాస్ మరమ్మతులు చేసేందుకు వెళ్లాడు. అయితే.. విద్యుత్ స్తంభం ఎక్కిన అతడు మరమత్తు పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. కరెంట్ ధాటికి తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ స్తంభం పైనుంచి కింద పడ్డాడు. అతడిని గమనించిన సహచరులు చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.