చర్లపల్లి : సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో పలు అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. డివిజన్లో నెలకొన్న సమస్యలను గుర్తించి దశలవారిగా పరిష్కరించేందుకు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ల భాగస్వామ్యంతో పనులు చేపట్టి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుండటంతో ప్రజలు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో నెలకొన్న మంచినీటి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో పలు డివిజన్లకు చెందిన కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా చర్లపల్లి డివిజన్లో మంచినీటి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు నిధులు కేటాయించి పనులు చేపడుతుండటంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. డివిజన్ పరిధిలోని కుషాయిగూడ ఆరుంధతి కాలనీ, భాగ్యనగర్, సుభాష్చందర్నగర్, శిశుమందిర్, కుషాయిగూడ భజనమందిర్, రజకబస్తీ, వార్డు కార్యాలయం, కుషాయిగూడ పారిశ్రామికవాడలో నూతన మంచినీటి పైప్‌లైన్ నిర్మాణం కోసం సుమారు కోటి రూపాయల నిధులు కేటాయించి నూతన మంచినీటి పైప్‌లైన్ నిర్మాణం పనులు చేపట్టి పూర్తి చేసి నూతన కనెక్షన్లు ఇచ్చేందుకు జలమండలి అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలు సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ త్వరతగతిన పనులుపూర్తి చేస్తున్నారు.
మంచినీటి సమస్యలను పరిష్కరించడం అభినందనీయం : వెంకటేశ్, ఆరుంధతీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
కుషాయిగూడలోని పలు కాలనీల్లో నెలకొన్న మంచినీటి సమస్యలను పరిష్కరించేందుకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేయడం హర్షనీయం. కాలనీల్లో పాత పైప్‌లైన్ ఉండటంతో గత పదిహేను ఏండ్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పాత పైప్‌లైన్ స్థానంలో నూతన పైప్‌లైన్ నిర్మాణం పనులు చేపట్టి కొత్త కనెక్షన్లు ఇవ్వడం అభినందనీయం.
కాలనీల సమగ్రాభివృద్దికి నిధులు కేటాయించడం సంతోషకరం : గొడల రమేశ్, స్థానికుడు
నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషకరం. ముఖ్యంగా చర్లపల్లి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలు కృషి చేస్తున్నారు.