మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 1 : వార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర నివేదికను రూపొందించాలని అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ పేర్కొన్నారు. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో శుక్రవారం ఆయన పర్యటించారు. వార్డులో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్ సరిత జిల్లా కలెక్టర్ హరీశ్ దృషికి తీసుకువెళ్లగా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ వార్డులో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు ఓపెన్ నాలా సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. మున్సిపాలిటీ నుంచి ఎన్ని నిధులు వెచ్చించారని కౌన్సిలర్‌ను అడుగగా.. రూ.45 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్వామి, డీఈ సుమతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.