రామగిరి, మే 14 : తెలంగాణ రాష్ట్ర సమగ్ర ప్రవేశ పరీక్ష టీజీ ఐసెట్ 2026ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 69 పరీక్షా కేంద్రాలలో సమర్థవంతంగా నిర్వహించారు. మూడు సెషన్లలో నిర్వహించిన ఈ పరీక్ష పారదర్శకంగా నిర్వహించారు. మొత్తం 56,206 మంది నమోదు చేసుకున్న అభ్యర్థుల్లో 51,146 మంది హాజరయ్యారు. 5,060 మంది గైర్హాజరయ్యారు. దీంతో మొత్తం హాజరు శాతం 91 శాతంగా నమోదైంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం టీజీ ఐసెట్ –2026కు విద్యార్థుల నుంచి వచ్చిన ఈ భారీ స్పందన వారి ఉన్నత ఆశయాలను ప్రతిబింబిస్తోందని కన్వీనర్ ఆచార్య అల్వాల రవి అన్నారు. గురువారం ఉదయం సెషన్లో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉప కులపతి, టీజీ ఐసెట్ –2026 చైర్మన్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, అధికారులు, పరిశీలకుల సమక్షంలో ప్రశ్నాపత్రం సెట్ కోడ్ “C”ను అధికారికంగా విడుదల చేశారు.
ఈ రోజు సెషన్‌కు 18,711 మంది నమోదు చేసుకోగా 17,056 మంది హాజరయ్యారు. హాజరు శాతం 91.17 కాగా, 1,652 మంది గైర్హాజరయ్యారు. టీజీ ఐసెట్ కార్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ నుండి కన్వీనర్, కో-కన్వీనర్లు అన్ని పరీక్షా కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షించారు. టీజీ ఐసెట్ –2026 కన్వీనర్ ఆచార్య అల్వాల రవి మాట్లాడుతూ.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పరీక్ష విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ మరియు అధికారులు, పరీక్షా అధికారుల సమన్వయం, అభ్యర్థులు, సిబ్బంది, ఇతర భాగస్వాముల సంపూర్ణ సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.