Medchal | కీసర, ఫిబ్రవరి 20 : చిన్ననాటి స్నేహితుల కోసం వచ్చి వారిని కలిసిన ఆనందంలో చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువకుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కీసర సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం విశాఖపట్నం ప్రాంతానికి చెందిన సూర్యదేవ్ (26) ప్రయివేట్ జాబ్ చేస్తున్నాడు. తన పుట్టిన రోజు ఉన్నందున విశాఖపట్నం నుండి ఈనెల 19వ తేదీన తన చిన్ననాటి స్నేహితులు అయిన దినేష్, కాలేషా, లోహిత్, తేజలను కలువడానికి హైదరబాద్ వచ్చాడు. అదే రోజు తన పుట్టినరోజు వేడుకలను గచ్చిబౌలిలో చేసుకొని తోటి స్నేహితులో సరదాగా గడిపాడు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల మధ్యలో దమ్మాయిగూడ మున్సిపాల్టీ పరిధి యాద్గార్పల్లిలోని అండర్ మూన్ చెరువు వద్దకు చేరుకొన్నారు.
చెరువులో నిండా నీరు కన్పించడంతో సరదాగా స్నానం చేద్దామని సూర్యదేవ్ సాయంత్రం సమయంలో చెరువులోకి దిగారు. ప్రమాదవశత్తు అతను నీట మునిగి మృతిచెందాడు. ఈ విషయాన్ని తోటి స్నేహితులు కీసర పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని చెరువుల్లోంచి బయటికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఈ కేసును కీసర పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.