శామీర్‌పేట,(మేడ్చల్ జిల్లా) : బస్సుకోసం బస్టాప్‌లో వేచి చూస్తున్న ఇద్దరు యువతులను రెడీమిక్స్ లారీ డి కొట్టింది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. తూంకుంట మున్సిపాలిటీ అంతాయి పల్లి కి చెందిన గాయత్రి, భవానీ నగరంలోని కాల్ సెంటర్ లో పని చేస్తున్నారు. అంతాయిపల్లికి బస్సు సౌకర్యం లేకపోవడంతో సోమవారం ఉదయం బిట్స్ పిలానీ చౌరస్తాలో బస్సుకోసం ఎదురు చూస్తున్నారు.అదే సమయంలో అంతాయి పల్లి నుంచి తూంకుంట వైపు వస్తున్న రెడీమిక్స్ లారీ ఎదురుగా వస్తున్న కారును తప్పించ బోయి రోడ్డు పక్కన కూర్చున్న యువతులను ఢీ కొట్టి, ఈడ్చుకెళ్ళింది.
ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రి కి తరలించారు. ఈ విషయం అంతాయి పల్లి గ్రామస్తులకు తెలియడం తో ఘటనా స్థలానికి చేరుకొని, రోడ్డు పై బైఠాయించి, ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్తులకు నచ్చచెప్పి, రాస్తారోకో విరమింప చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం తో పాటు బాధితులకు న్యాయం చేయాలని కలెక్టరెట్ కార్యాలయం వద్ద కూడా నిరసన వ్యక్తం చేశారు.